: పాక్ లో అత్యధిక ఆదాయం పొందిన క్రికెటర్ తో పోలిస్తే కోహ్లీకి 100 రెట్లు అధికాదాయం!
పాకిస్థాన్ లో అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న క్రికెటర్ మహ్మద్ హఫీజ్. ఇతనికి 2015-16 సంవత్సరంలో పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) నుంచి రూ. 2.49 కోట్ల ఆదాయం అందింది. మహ్మద్ హఫీజ్ తో పోలిస్తే, భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత ఎత్తున ఉన్నాడో తెలుసా? హఫీజ్ కన్నా 100 రెట్లు అధికాదాయాన్ని కోహ్లీ పొందాడు. బీసీసీఐ నుంచి వేతనం, మ్యాచ్ ఫీజులు, యాడ్స్ తదితరాల నుంచి కోహ్లీకి గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 308 కోట్లు అందాయి. ఇక పాక్ లోని 46 మంది క్రికెటర్లకు అందిన ఫీజు మొత్తం రూ. 100 కోట్లను కూడా దాటలేదని తెలుస్తోంది. ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, శ్రీలంక జట్టు ఆ దేశంలో పర్యటిస్తున్న వేళ ఉగ్రవాదులు దాడి చేయడంతో మరే ప్రదాన జట్టూ అక్కడ పర్యటించేందుకు అంగీకరించక పోవడంతోనే తీవ్ర నష్టాల్లో పీసీబీ కూరుకుపోగా, ఆ ప్రభావం ఆటగాళ్లపైనా పడిందని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు.