: చదువులో వెనకబడిందంటూ టీచర్ ఫిర్యాదు.. ఆత్మహత్య చేసుకున్న ఏడో తరగతి విద్యార్థిని
చదువులో వెనకబడిందంటూ ఓ టీచర్ చేసిన ఫిర్యాదు బాలిక నిండు ప్రాణం తీసింది. తాను చదువులో అంతగా రాణించలేకపోతున్న విషయాన్ని తన తల్లికి టీచర్ చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలో శనివారం జరిగిందీ ఘటన. ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్లో పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని తన తల్లి షాజహాన్‌తో కలసి హాజరైంది. ఈ సందర్భంగా బాలిక చదువులో బాగా వెనకబడిందంటూ క్లాస్ టీచర్.. విద్యార్థిని గురించి ఆమె తల్లికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన షాజహాన్ అక్కడే కుమార్తెపై విరుచుకుపడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇంటికి వచ్చిన వెంటనే గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.