: దేశవ్యాప్తంగా కాపలాలేని రైల్వే గేట్లను మూసివేయనున్న రైల్వే... ప్రమాదాల నివారణే లక్ష్యం

కాపలా లేని రైల్వే క్రాసింగ్‌‌ల వద్ద ప్రమాదాలు జరుగుతుండడంపై దృష్టి సారించిన రైల్వే దేశంలోని 6వేలకు పైగా ఉన్న లెవల్ క్రాసింగులను మూసివేయాలని భావిస్తోంది. ఆ స్థానంలో అండర్ బ్రిడ్జ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని యోచిస్తోంది. మరో మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని నిర్ణయించింది. లెవల్ క్రాసింగుల వద్ద ఒక్కటంటే ఒక్క ప్రమాదమూ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దేశంలో మొత్తం 28,607 లెవల్ క్రాసింగులు ఉండగా వీటిలో 19,267 క్రాసింగుల వద్ద కాపలా ఉంటోంది. మిగతా 9340 క్రాసింగుల వద్ద కాపలా లేదు. బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ పరిధిలో మొత్తం 6,388 మానవ రహిత లెవల్ క్రాసింగులు ఉన్నాయి. వీటిని మూసేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. మిగతా 2,952 మాత్రం మీటర్ గేజ్/నేరో గ్రేజ్ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. 2014-15లో 1,148, 2015-16లో 1,253 లెవల్ క్రాసింగులను రైల్వే ఎత్తివేసింది. గేట్ మిత్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించినట్టు అధికారులు పేర్కొన్నారు. 2014-15లో క్రాసింగుల వద్ద 50 ప్రమాదాలు జరగ్గా 2015-16లో వాటిని 29కి తగ్గించామన్నారు. అయితే ఒక్క ప్రమాదం కూడా జరగకూడదనే ఉద్దేశంతోనే లెవల్ క్రాసింగులను ఎత్తివేసి ఆ ప్రాంతాల్లో ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జిలను నిర్మించాలని భావిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News