: పాకిస్థాన్ లో పరువు హత్యల పరంపర... మరికొన్ని గంటల్లో పెళ్లనగా, ఇద్దరు చెల్లెళ్లనూ కాల్చిచంపిన అన్న!
మరికొన్ని గంటల్లో తాము ప్రేమించిన వారిని వివాహం చేసుకోనున్నామన్న ఆ ఇద్దరు అమ్మాయిల ఆనందం ఆవిరైంది. తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రేమ పెళ్లికి సిద్ధపడ్డారని ఆరోపిస్తూ, వారిద్దరి సోదరుడే వాళ్లను అతి కిరాతకంగా తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోసూర్ (22), గుల్జార్ బీబీ (28)లకు వారు ప్రేమించిన వారితోనే పెళ్లిళ్లు జరిపేందుకు పెద్దలు నిర్ణయించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారి అన్న నాసిర్ హుస్సేన్ ఇద్దరినీ కాల్చి చంపాడు. పరువు హత్యగా ఈ కేసును నమోదు చేశామని, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు. తన బిడ్డే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఎంతమాత్రమూ ఊహించలేదని మృతురాళ్ల తండ్రి అత్తా మహమ్మద్ వాపోయాడు.