: దుబాయ్ చెక్కేసిన ఎంసెట్-2 ప్రధాన నిందితులు!
తెలంగాణ ఎంసెట్-2 లీకేజీలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ముంబైకి చెందిన షేక్ నౌషాద్ అలీ, గుడ్డూలు దుబాయ్ కి పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆధారాలు సేకరించిన సీఐడీ పోలీసులు దుబాయ్ కి ప్రత్యేక బృందాన్ని పంపారు. నౌషాద్ అనుచరుడు రాజేశ్, బ్రోకర్ రామకృష్ణలను అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు, మిగతావారిని సైతం త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. దుబాయ్ కి పారిపోయిన నౌషాద్, గుడ్డూలు ఇద్దరూ దొరికితేనే లీకేజీ వ్యవహారంలో ఎంత మంది నుంచి డబ్బు అందింది, అవి ఎవరికి ఇచ్చారన్న విషయం తేలుతుందని భావిస్తున్న అధికారులు ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. వీరిద్దరూ ఆరు రోజుల క్రితమే దుబాయ్ పారిపోయినట్టు కనిపెట్టి, ఆపై దుబాయ్ లో వారు ఎక్కడున్నారన్న విషయమై అక్కడి అధికారులతో చర్చిస్తున్నారు. వీరు తమ సెల్ ఫోన్ నంబర్లు మార్చివేయడంతో ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారన్న విషయం తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఇక పోలీసులు అరెస్ట్ చేసిన రాజేశ్, స్వయంగా ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎంసెట్-2 పేపర్లు బయటకు తెచ్చినట్టు తేలింది. నౌషాద్ ఆదేశాల మేరకే ప్రెస్ నుంచి దాన్ని తీశానని, అందులో ఏముందన్న విషయం తనకు తెలియదని రాజేశ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని రామకృష్ణ, రమేశ్ లకు ఇచ్చి రూ. 1.20 కోట్లను తీసుకున్నట్టు కూడా రాజేశ్ అంగీకరించాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేయాల్సివుందని అధికారులు చెబుతున్నారు.