: తొలి రోజే పట్టు బిగించిన భారత్... 196 పరుగులకు విండీస్ ఆలౌట్, ఇండియా 126/1
బౌలర్లు రాణించడంతో కింగ్ స్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి రోజే పట్టు బిగించింది. టాస్ గెలిచిన విండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 52.3 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బ్లాక్ ఉడ్ 62 పరుగులు మినహా మరెవరూ పెద్దగా రాణించలేకపోయారు. శామ్యూల్స్ 37, కమ్మిన్స్ 24 పరుగులకు అవుట్ కాగా, అశ్విన్ కు 5, షమీ, శర్మలకు చెరి రెండు, మిశ్రాకు ఒక వికెట్ లభించింది. తొలి మూడు వికెట్లనూ 7 పరుగులలోపే విండీస్ జట్టు కోల్పోయింది. 1983 తరువాత వెస్టిండీస్ జట్టు భారత్ పై ఏడు పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆపై బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 87 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. 52 బంతులాడి 27 పరుగులు (5 ఫోర్లు) చేసిన ధావన్, రోస్టన్ బౌలింగ్ లో బ్రావోకు క్యాచ్ ఇచ్చాడు. మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ 75 పరుగులు, పుజారా 18 పరుగులతో ఆడుతున్నారు. కాగా, మురళీ విజయ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో, లోకేశ్ రాహుల్ ను బరిలోకి దించిన సంగతి తెలిసిందే.