: సదావర్తి భూములపై కొత్త నోటీస్ విడుదల చేసిన దేవాదాయ శాఖ
తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న సదావర్తి భూములపై వివాదం రేగడంతో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. సదావర్తి భూముల వివాదం సందర్భంగా టెండర్లలో తమను పాల్గోనివ్వలేదని ఆరోపించిన పీఎల్ఆర్ సంస్థ 72 గంటల్లో 28.05 కోట్లను డిపాజిట్ చేస్తే... ఇప్పటికే కేటాయించిన టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా, 83.11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూములను కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ఆయన భార్య చలమలశెట్టి లక్ష్మీపార్వతి, వారి కుమారుడు చలమలశెట్టి నిరంజన్ బాబు, గుంటూరు జిల్లాకు చెందిన మందాల సంజీవరెడ్డి, ఎం.సునీతారెడ్డి, చావలి కృష్ణారెడ్డి, ఎం.సూర్యకిరణ్‌మౌళి, డి.పవన్‌కుమార్, ఆర్.శివరామకృష్ణారావులు 22.44 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. దీనిపై పెను వివారం రేగింది. ఇక్కడ ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున వేలానికి ఉంచగా, ధర ఎక్కువైందని భావించిన కొనుగోలుదారులు ముందుకు రాలేదని, దాంతో భూముల ధరను తగ్గించి ఎకరం 27 లక్షల చొప్పున 83.11 ఎకరాలను 22.44 కోట్ల రూపాయలకు ఇవ్వడం జరిగిందని చెబుతున్న దేవాదాయ శాఖ... ఇప్పుడు విక్రయించిన ధరకు అదనంగా సుమారు 6 కోట్ల రూపాయలు ఎందుకు డిపాజిట్ చేయమందో చెప్పలేదు.