: అసోంలో వరద బీభత్సాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన రాజ్ నాథ్ సింగ్
అసోంలో వరద బీభత్సం సృష్టించిన నష్టాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 60 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు. వారికి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులంతా సహాయ సహకారాలు అందిస్తున్నారని, పలువురు ప్రజాప్రతినిధులు స్వయంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆయన వెల్లడించారు. భాదితులను ఆదుకునేందుకు, సహాయక చర్యలు మరింత విస్తరించేందుకు ఎన్జీవోలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వరదల నష్టం నుంచి కోలుకునేందుకు కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని ఆయన తెలిపారు. కాగా, వరదల కారణంగా అసోంలో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు.