: ఇంఫాల్ సెంట్రల్ జైల్లో ఖైదీల ఫైటింగ్... ముగ్గురి మృతి
మణిపూర్ లోని ఇంఫాల్ సెంట్రల్ జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ ముగ్గురు ఖైదీల ప్రాణాలు తీసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంఫాల్ లోని సెంట్రల్ జైల్ సెల్ నెంబర్ 1 లో యూసుఫ్ (21), అబ్దస్ (22) అనే ఖైదీలు తమ సెల్ లో ఉన్న చురాచంద్ పూర్ జిల్లాకు చెందిన తంగిమిన్ లీన్ అనే ఖైదీని దారుణంగా హతమార్చారు. తంగిమిన్‌లిన్ చనిపోయాడన్న వార్త తెలియగానే, ఇతర సెల్ లలో ఉన్న కొంత మంది ఖైదీలు సెల్ నెంబర్ 1 లోకి దూసుకెళ్లి హత్యకు పాల్పడిన యూసుఫ్, అబ్దస్ పై దాడి చేశారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు జైలు అధికారులు, ఒక ఖైదీ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. జైలులో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశామని, హత్యలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.