: వెస్టిండీస్ చివరి నిమిషంలో తప్పుకోవడానికి కారణం లాహోర్ పేలుళ్లే!: పీసీబీ
2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాద దాడి అనంతరం ఏ జట్టూ పాకిస్థాన్ లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని పీసీబీ పేర్కొంది. ఎట్టకేలకు వెస్టిండీస్ పాకిస్థాన్ లో సిరీస్ ఆడేందుకు అంగీకరించినప్పటికీ ఇటీవలి లాహోర్ పేలుళ్ల కారణంగా వారు కూడా పాక్ లో క్రికెట్ ఆడమని తేల్చిచెప్పారని పీసీబీ ఆవేదన వ్యక్తం చేసింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చల సందర్భంగా తమతో కొన్ని పరిమిత ఓవర్ల మ్యాచ్ లు ఆడాలని విండీస్ ను అభ్యర్థించగా, పాకిస్తాన్ క్రికెట్ కు సహకారం అందించేందుకు వారు ముందుకొచ్చారని పీసీబీ తెలిపింది. ఈ మేరకు చర్చలు కూడా విజయవంతమయ్యాయని, ఇంతలో లాహోర్ పేలుళ్లను చూసిన వెండీస్ బోర్డు... పాకిస్తాన్ లో ఆటగాళ్లకు భద్రతపరమైన సమస్యలున్నాయని చెబుతూ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ కు రాలేమని తేల్చి చెప్పిందని పీసీబీ చెప్పింది. దీంతో ఈ సిరీస్ మొత్తాన్ని యూఏఈలో నిర్వహించాల్సి వస్తోందని పీసీబీ వెల్లడించింది.