: తొలి టెస్టు ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు: జాసన్ హోల్డర్
టీమిండియాతో జరిగిన తొలి టెస్టు ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తెలిపాడు. సబీనా పార్క్ స్డేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో హోల్డర్ మాట్లాడుతూ, తొలి టెస్టుతో పోలిస్తే రెండో టెస్టులో జట్టు బలోపేతమైందని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి విండీస్ బౌలింగ్ మెరుగ్గా కనిపిస్తోందని చెప్పాడు. అయితే భారత్ లాంటి బ్యాటింగ్ విభాగంపై తమ బౌలింగ్ విభాగం ప్రభావం చూపిస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ఫామ్, బ్యాటింగ్ లైనప్ లో బలహీనతలు తమ జట్టును గందరగోళంలోకి నెడుతున్నాయని పేర్కొన్నాడు. అయితే సమష్టిగా రాణిస్తే విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెడుతున్న తమ యువ ఆల్ రౌండర్ అల్జారీ జోసెఫ్ గురించి తెలుసుకోవాలని, అతని ఆటతీరుపై పెద్దగా అవగాహన లేదని అన్నాడు. అయితే జాతీయజట్టుకు సెలక్టయ్యాడంటే ప్రతిభ ఉన్న ఆటగాడన్న విషయం అర్థమైందని తెలిపాడు. అతడు రాణిస్తే జట్టుకు ఉపయోగపడతాడని జాసన్ హోల్డర్ చెప్పాడు.