: జైట్లీపై కాకుండా మాపై చంద్రబాబు మండిపడుతున్నారు: కేవీపీ ఆగ్రహం
ఆంధ్రుల భవిష్యత్తు కోసం తాను పోరాటాన్ని కొనసాగిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడంలో తాను వెనకంజ వేయబోనని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, వారి ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా వారి తరఫున కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేనేలేదన్నట్లు మాట్లాడితే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై కాకుండా కాంగ్రెస్‌పై మండిపడుతున్నారని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పై చంద్రబాబు అనవసర విమర్శలు గుప్పిస్తున్నారని, తాము ఏపీకి హోదాపై ఎంతో చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యసభలో పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్‌లోని అంశాల్ని మీడియాకి చదివి వినిపించారు.