: నాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల దృశ్యాలను ప్రదర్శించిన జగన్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదాపై భారీ ఎత్తునే నిరసన గళం విప్పినట్లుంది. వచ్చే నెల 2న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన జగన్... కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా గతంలో మాదిరే వినూత్న ప్రయోగం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై గతంలో వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియాకు వినిపించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసిన జగన్... టీవీ తెరపై చంద్రబాబు చేసిన వేర్వేరు ప్రకటనలను వరుసగా వినిపించారు. ఈ సందర్భంగా జగన్ ఏర్పాటు చేసిన తెరపై నాలుగు విండోలలో నలుగురు చంద్రబాబులు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. ఒక్కో సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఈ నాలుగు విండోలలోను ప్రదర్శించారు. తిరుపతిలో నరేంద్ర మోదీ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, సీఎం హోదాలో ఢిల్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ప్రత్యేక హోదాపై ప్రత్యేక భాష్యం చెప్పిన చంద్రబాబు తీరు, ప్రత్యేక హోదా వస్తే అంతా అయిపోతుందా? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అంటూ నాలుగు ఫొటోలకు నాలుగు ట్యాగ్ లు తగిలించిన జగన్... చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు.