: ఇప్పటిదాకా అభ్యర్థన!... ఇకపై బీజేపీపై పోరుబాటే!: సన్నిహితుల వద్ద చంద్రబాబు
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును బీజేపీ అడ్డుకున్న తీరుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం విజయవాడలో పార్టీకి చెందిన కొందరు సన్నిహితులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాల కోసం బీజేపీని ఇప్పటిదాకా అభ్యర్థించామని, ఇకపై ఆ పార్టీపై పోరుకు సిద్ధం కాక తప్పని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయమే బీజేపీ కూడా చేస్తోందని కూడా చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీతో పొత్తు కారణంగా గడచిన ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లను కోల్పోయామని కూడా చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒక్క శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని చెప్పిన చంద్రబాబు... కాంగ్రెస్ కు 2 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. సింగిల్ డిజిట్ దాటని ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. బీజేపీ కారణంగా కొన్ని సామాజిక వర్గాలు టీడీపీకి దూరమయ్యాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అన్నీ ఓర్చుకున్నప్పటికీ కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా తమకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహా పరిస్థితి కొనసాగితే తమిళనాడులో పట్టిన గతే బీజేపీకి ఏపీలోనూ తప్పదని కూడా చంద్రబాబు కాస్తంత స్వరం పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.