: బెంగళూరులో నడిరోడ్డుపై చేపలు!... వలలు వేసి పట్టుకున్న నగరవాసులు!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రాయలసీమతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బెంగళూరు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నగరంలోని చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి. ఈ క్రమంలో నడిరోడ్డుపై పారుతున్న వర్షపు నీటిలో చేపలు ప్రత్యక్షమయ్యాయి. నడిరోడ్డుపై చేపలను చూసిన బెంగళూరు వాసులు వలలు చేతబట్టుకుని రంగంలోకి దిగేశారు. కనిపించిన చేపలను పట్టుకుంటూ బుట్టలను నింపుకున్నారు. చేపలు పట్టేందుకు రోడ్లపైకి జనం రావడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది.