: టీడీపీది రెండు నాల్కల ధోరణి!... వైసీపీ ‘జంపింగ్’ల మాటేమిటంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకుల!
ఏపీకి ప్రత్యేక హోదా అంశం మిత్రపక్షాలు బీజేపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తోంది. నిన్న రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లుపై జరిగిన చర్చ పేలవంగా ముగిసిన నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో గడచిన ఎన్నికల్లో తమతో పొత్తు కారణంగానే బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు దక్కాయని, దమ్ముంటే ఆ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని టీడీపీ రాజ్యసభ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు ఘాటుగా స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీ టికెట్ల మీద ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని టీడీపీ తనలో చేర్చుకున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే... తాము కూడా రాజీమానా చేసి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం సహకరించడం లేదన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోపణలను తాను ఖండిస్తున్నానని కూడా ఆకుల పేర్కొన్నారు. టీడీపీ నేతలు రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని ఆయన మండిపడ్డారు.