: హైదరాబాద్‌లో ఒకేసారి ఎనబై శాతం ఫీజులు పెంచేసిన కార్పొరేట్ స్కూల్.. తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్‌లోని సైనిక్‌పురి సమారిటిన్స్ స్కూల్ ముందు ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 80 శాతం ఫీజులు పెంచేశారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, నోట్ పుస్తకాలు, స్కూల్ యూనిఫాం అంటూ ఎన్నో రకాల ఫీజుల భారం వారిపై వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను స్కూలు ఏ మాత్రం పాటించడం లేదని వారు మండిపడుతున్నారు. స్కూల్‌లో గ్రౌండ్ సహా ఇతర ఏ సదుపాయాలూ లేకపోయినా భారీ మొత్తంలో ఫీజులు పెంచేసి యాజమాన్యం తమని దోచుకుంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. స్కూలు దోపిడిని గురించి అడిగితే తమ పిల్లలకు టీసీ ఇచ్చి పంపిచేస్తామంటూ యాజమాన్యం బెదిరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, స్కూలు వద్ద ఎటువంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా అక్కడ పోలీసులు మోహరించారు.