: త్రిశంకు స్వర్గంలో గుర్‌దీప్ సింగ్.. ఇంకా మెడపైనే వేలాడుతున్న కత్తి!
ఇండోనేషియాలో డ్రగ్స్ కేసులో చిక్కుకుని మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయుడు గుర్‌దీప్ సింగ్(48) భవితవ్యం ఇంకా డోలాయమానంలోనే ఉంది. క్షణానికో సమాచారం అందుకుంటున్న అతని కుటుంబ సభ్యులు ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోతున్నారు. గురువారం గుర్‌దీప్‌కు మరణశిక్ష అమలు చేసినట్టు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అతని భార్య షాక్‌తో సొమ్మసిల్లి పడిపోయింది. ఆ తర్వాత కాసేపటికి వాట్సాప్ ద్వారా మరో మెసేజ్ అందింది. ఇప్పటికైతే అతను క్షేమంగా ఉన్నాడన్నది దాని సారాంశం. ఆ తర్వాత ఇండోనేషియాలోని భారత ఎంబసీ నుంచి వారికి ఫోన్ కాల్ వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన అధికారులు ప్రస్తుతానికి గుర్‌దీప్ మరణశిక్షను ఆపివేసినట్టు పేర్కొన్నారు. ఇలా క్షణానికో సమాచారం అందుతుండడంతో ఏం జరుగుతుందో తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు. న్యూజిలాండ్‌లో డ్రైవర్ ఉద్యోగానికి వెళ్తూ 2002లో గుర్‌దీప్ ఇండోనేషియాలో డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. హెరాయిన్ కలిగి ఉన్న అతడిని జకార్తా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అతడితో పాటు అరెస్టయిన మరో 13 మందిలో నలుగురికి శుక్రవారం మరణశిక్ష అమలుచేశారు. అయితే గుర్‌దీప్ మరణశిక్షను ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. గుర్‌దీప్ సింగ్ మరణశిక్ష అమలు ఇండోనేషియాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆగిందా? లేక భారత్ నుంచి వస్తున్న దౌత్య ఒత్తిళ్ల వల్ల ఆగిందా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే మరణశిక్ష పడిన వారిని ఇప్పటి వరకు వదిలిపెట్టిన చరిత్ర లేదని ఇండోనేషియా అటార్నీ జనరల్ పేర్కొనడం గమనార్హం.