: హైదరాబాద్ వాటర్ బోర్టు కార్యాలయంలో 8 అడుగుల మొసలి.. బెంబేలెత్తిన ఉద్యోగులు
హైదరాబాద్ వాటర్ బోర్డు కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ మొసలి ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసింది. 8.5 అడుగుల పొడవున్న ఈ మొసలి మంజీర నది నుంచి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ వాటర్ బోర్డు కార్యాలయంలో ఉన్న వాటర్ పైపులైన్ వద్ద సెటిలైపోయిన ఈ మకరాన్ని పట్టుకునేందుకు అధికారులకు రెండు గంటలు పట్టింది. మంజీర వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి కార్యాలయం అత్యంత సమీపంలో ఉంది. ఈ సంరక్షణ కేంద్రంలో దాదాపు 500 వరకు మొసళ్లు ఉన్నాయి. మొసలిని పట్టుకున్న అనంతరం దానిని నదిలో వదిలిపెట్టారు. మొసళ్లు తరచూ ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పొలాల్లోకి, కాలువల్లోకి, నివాస ప్రాంతాల్లోకి చొరబడుతున్న మొసళ్లపై అధికారులకు ఇటీవల పలు ఫిర్యాదులు అందాయి. నదిలో నీరు లేకపోవడం, ఆహారం తగినంత దొరక్కపోవడమే ఇందుకు కారణం. వర్షాలు పడుతున్నా నది పూర్తిస్థాయిలో నిండకపోవడంతో అల్లాడిపోతున్న మొసళ్లు ఆహారం, నీటి కోసం వెతుక్కుంటూ సమీప ప్రాంతాలకు చేరుకుంటున్నాయి.