: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆగస్టు వేతనంతోనే బకాయిలు


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఏడో వేతన సంఘం సిఫార్సులు ఆగస్టు నుంచే అమలు కాబోతున్నాయి. పెరిగిన జీతాల బకాయిలను ఆగస్టు నెల జీతంతో కలిపి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రకటించింది. వేతన సంఘం సిఫారసులతో కేంద్రం ఉద్యోగుల మూల వేతనానికి 2.57 రెట్లు పెంచుతూ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ పెంపుతో కోటి మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. జనవరి 1, 2016 నుంచి పెంపు అమల్లోకి వస్తుంది. అంటే దాదాపు ఎనిమిది నెలల బకాయిలను ఉద్యోగులు ఒకేసారి అందుకోనున్నారు. అయితే సవరించిన వేతనాల నుంచి జీపీఎఫ్, నేషనల్ పెన్షన్ స్కీం, ఆదాయ పన్నులు మినహాయించి మిగిలిన బకాయిలను చెల్లించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే సవరించిన వేతనాలపై డీఏ శాతాన్ని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది. సవరించిన పేస్కేల్ ప్రకారం ముందస్తు పరిశీలన లేకుండానే చెల్లింపులు జరపనున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. కాగా వేతనాలు సవరించడంతో గతంలో రూ.7 వేలు అందుకునే ఉద్యోగి ఇప్పుడు రూ.18వేలు అందుకోనున్నాడు. అలాగే క్యాబినెట్ సెక్రటరీ వేతనం రూ.90 వేల నుంచి రూ.2.5 లక్షలకు చేరుకుంది.

  • Loading...

More Telugu News