: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూతురిపై హత్య కేసు నమోదు!
నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డికి నిన్న మరో ఎదురు దెబ్బ తగిలింది. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాదించిన ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత అధికార పార్టీ టీడీపీ దరికి చేరారు. అయితే ఇప్పటిదాకా టీడీపీలో అధికారికంగా చేరని ఆయన వైసీపీకి ఆమడ దూరంలో కొనసాగుతున్నారు. తాజాగా నిన్న ఆయన కూతురు సుజలపై హత్య కేసు నమోదైంది. నంద్యాల పరిధిలో ఎస్పీవై రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న ‘నంది అకాడమీ స్కూల్’ లో పీఆర్వోగా పనిచేస్తున్న సుమంత్ (25) అనే యువకుడి దారుణ హత్యపై బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. స్కూలులో పీఆర్వోగా పనిచేస్తున్న సుమంత్ పాఠశాలలో విద్యార్థులను చేర్చేందుకంటూ యాజమాన్యం వద్ద కొంత మేర నగదు తీసుకున్నాడు. అయితే అనుకున్న మేరకు విద్యార్థులను చేర్చలేని సుమంత్ నుంచి నగదును రాబట్టేందుకు యాజమాన్యం యత్నించింది. ఈ క్రమంలో సుమంత్ నగదు వాపస్ ఇవ్వకపోవడంతో యాజమాన్యం ప్రతినిధులుగా రంగంలోకి దిగిన షఫీ, మురళిలు అతడిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలోనే అతడు చనిపోయాడు. దీనిపై మృతుడి సోదరుడు సుమన్, సుజల సూచన మేరకే వారు ఈ దారుణానికి పాల్పడినట్టు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్పీవై రెడ్డి కూతురు సుజల, పాఠశాల ఉద్యోగులు షఫీ, మురళిలపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.