: మల్లన్నసాగర్ పాకిస్థాన్ లో ఉందా?... ప్రతిపక్ష నేతలు టెర్రరిస్టులా?: డీకే అరుణ
మల్లన్నసాగర్ కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అధికార పార్టీ అడ్డుకోవడంపై మాజీ మంత్రి డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, మల్లన్నసాగర్ ఏమన్నా పాకిస్థాన్ లో ఉందా? లేకపోతే ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం టెర్రరిస్టులుగా భావిస్తోందా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ కు రైతులంతా స్వచ్చందంగా భూములిచ్చారని హరీష్ రావు చెప్పడం అబద్ధమని అన్నారు. 'మల్లన్నసాగర్ కు ప్రతిపక్షాలను వెళ్లనిస్తే కదా, అక్కడేం జరుగుతుందో తెలియడానికి' అని ఆమె పేర్కొన్నారు. షబ్బీర్ అలీ, జానారెడ్డిల అరెస్టులను ఆమె ఖండించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. మల్లన్నసాగర్ రైతుల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగులుతుందని ఆమె శాపనార్థాలు పెట్టారు.