: డెమొక్రటిక్ పార్టీ అతిచిన్న వయసు ప్రతినిధిగా ఇండో-అమెరికన్ అమ్మాయి
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. అయితే, డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో హిల్లరీ క్లింటన్‌ను నామినేట్ చేసిన వారిలో ఇండో-అమెరికన్ అమ్మాయి 18 ఏళ్ల శృతి పలనియప్పన్ ఉన్నారు. 18 ఏళ్లకే హిల్లరీ క్లింటన్‌ను నామినేట్ చేసి డెమొక్రటిక్ పార్టీ అతిచిన్న వయసు ప్రతినిధి (డెలిగేట్)గా ఆమె నిలిచారు. అంతేగాక, అయోవా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా పొందారు. హిల్లరీకి అభిమాని అయిన శృతి అతి చిన్న వయసు డెలిగేట్‌గా నిలిస్తే.. ఆరిజోనా వృద్ధురాలు జెర్రీ ఎమ్మెట్(102) అతి పెద్ద వయసు ప్రతినిధిగా నిలిచారు. వీరిద్దరూ అందరి దృష్టిని ఆకర్షించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిని అయిన శృతి.. సీడార్ రాపిడ్స్‌కు చెందిన అమ్మాయి. క్రెడిన్షియల్స్ కమిటీ సభ్యుడైన ఆమె తండ్రి పలనియప్పన్ కూడా డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ కు హాజరయ్యారు. తనకు ఈ అవకాశం వచ్చినందుకు శృతి హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవికి తొలిసారి ఓ మహిళను నామినేట్ చేసిన నేపథ్యంలో అందులో తనను కూడా భాగం చేసినందుకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. ‘పార్టీ ప్రతినిధిగా ఎంపికవడం చాలా పెద్ద ప్రక్రియ. కన్వెన్షన్‌లో అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగం నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. ఒబామాలాగే హిల్లరీ కూడా దేశాభివృద్ధికి కృషి చేస్తారు. ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా అభివృద్ధిలో వెనకబడిపోతుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.