: ఏపీకి హోదా రాదని చెప్పకనే చెప్పిన అరుణ్ జైట్లీ!


ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితుల్లో కేంద్రం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పకనే చెప్పారు. ఎన్నో రాష్ట్రాలు వెనుకబడి వున్నాయని, ఆర్థిక సంఘం సూచించిన విధంగా, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల ప్రకారం ముందుకు సాగుతామే తప్ప, కేవలం ఒక మాట చెప్పి తప్పించుకున్న కాంగ్రెస్ పార్టీ అవకాశవాదాన్ని సమర్థించలేమని అన్నారు. దీంతో రాష్ట్రానికి హోదా రాదని తేలిపోయినట్లయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280లో వెల్లడించిన విధంగా మాత్రమే తాము పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. వాజ్ పేయి హయాంలో ఏర్పడిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కు మాత్రమే ప్రత్యేక హోదాను ఇచ్చామని, అది కూడా ఆనాటి ఆర్థిక సంఘం సూచిస్తేనే ఇచ్చామని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి తక్కువగా ఉంది కాబట్టే హోదా అమలవుతోందని చెప్పారు. అన్ని వనరులూ పుష్కలంగా ఉన్న ఏపీ వంటి రాష్ట్రం కష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనని, అభివృద్ధి దిశగా తమవంతు సాయం చేస్తామని చెప్పారు. ఏపీతో పాటు ఒడిశా వంటి ఎన్నో రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నాయని జైట్లీ గుర్తు చేశారు. ఎన్నో అంశాలను పరిశీలించిన తరువాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి వుందని వివరించారు. కాంగ్రెస్ వ్యతిరేకించిన పన్ను రాయితీలను సైతం ఏపీకి ఇచ్చామని వెల్లడించిన ఆయన, రాష్ట్రం కోరుతున్నట్టుగా మరిన్ని రాయితీలు ప్రకటిస్తే, పక్క రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టినట్టు అవుతుందని తెలిపారు. కేవలం నిరసనల కారణంగా ప్రత్యేక హోదాను ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News