: ఎన్ఐఏ ముందు అశ్చర్యకర నిజాలను వెల్లడించిన పాకిస్థానీ టెర్రరిస్ట్ బహదూర్ అలీ
పాకిస్థానీ ఉగ్రవాది బహదూర్ అలీ (అలియాస్ సైఫుల్లా)ని ఇటీవలే మన దేశ భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్న విషయం తెలిసిందే. కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టర్ సమీపంలో ఈ ఉగ్రవాది పట్టుబడ్డాడు. బహదూర్ అలీతో పాటు అక్కడ దాడులకు తెగబడ్డ మరో నలుగురు ఎల్ఈటీ ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. తాజాగా విచారణలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముందు బహదూర్ అలీ పలు ఆశ్చర్యకర నిజాలను తెలిపాడు. ‘నేను కశ్మీర్‌కు సాధారణ, అమాయక జనాలని హతమార్చేందుకు వచ్చా.. గెరిల్లా వార్ ఫేర్ లోని లష్కరే తోయిబాలో శిక్షణ తీసుకొన్నా’ అని అలీ తెలిపాడు. ‘ఆ తరువాత జమాత్ ఉద్ దవా (జుద్) ఛీఫ్ హఫీజ్ సయీద్ ను రెండు సార్లు కలిశా, పాకిస్థాన్‌లోని కంట్రోల్ రూమ్ తో నేను నిత్యం టచ్‌లోనే ఉంటా’ అని అన్నాడు. ఉగ్రవాది చెప్పిన వివరాల ప్రకారం అతను లాహోర్ నగరానికి చెందిన వాడని హోం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అదుపులోకి తీసుకున్న అనంతరం బహదూర్ అలీ నుంచి భద్రతా బలగాలు మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులు, 23 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ టీట్వాల్ నుంచి ఉగ్రవాదులు టాంగ్ధర్ గుండా లీపా లోయలోకి చొరబడినట్లు అధికారులు తెలిపారు.