: ఒక రాష్ట్రానికి ఇస్తే, పది అడుగుతాయి... సాధ్యమయ్యే పనేనా?: జైట్లీ


ప్రత్యేక హోదాను ఒక రాష్ట్రానికి ఇస్తే, పది రాష్ట్రాలు కూడా అడుగుతాయని, ఇది సాధ్యమయ్యే పనేనా? అని రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు సమాధానం ఇస్తూ ప్రశ్నించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హోదా రాదన్న సంగతిని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 14వ ఆర్థిక సంఘాన్ని నియమించామని వారు ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో ఏ రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలన్న విషయమై, తమ వద్ద సమగ్ర సమాచారం ఉందని, దానికి అనుగుణంగానే సాగుతున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు పూర్వం ఎంతో అభివృద్ధి చెందిన అధికాదాయ రాష్ట్రమని గుర్తు చేసిన ఆయన, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలతో ఎందులోనూ తీసిపోలేదని అన్నారు. ఆపై కాంగ్రెస్ చేసిన పని వల్ల రాజధాని నగరాన్ని పోగొట్టుకున్న ఏపీ ఆర్థిక లోటులో కూరుకుపోయిందని, నా సహచర సభ్యులు సైతం ఇదే విషయాన్ని చెప్పారని వివరించారు. విభజన చట్టంలో ఎన్నో అంశాలను పొందుపరిచారని, అవన్నీ ఏపీ అభివృద్ధికి సహకరించేవేనని అన్నారు. కేవలం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే రాష్ట్రాలు అభివృద్ధి చెందవని, ప్రజలు, పాలిస్తున్న ప్రభుత్వాలు, కేంద్రం కృషి వల్లే ముందడుగు సాధ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News