: మీరు కేంద్ర మంత్రి... హోదాపై చర్చలో మీకు సమయాన్ని నిర్దేశించలేను: సుజనా చౌదరితో డిప్యూటీ చైర్మన్ కురియన్
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రసంగించాల్సిన సమయంలో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వైఎస్ చౌదరీ... మీరు కేంద్ర మంత్రి. ఈ అంశంపై చర్చలో పాల్గొంటున్నారు. మీకు సమయాన్ని నిర్దేశించలేను. సంక్షిప్తంగా ప్రసంగించండి" అన్నారు. ఆపై సుజనా చౌదరి చర్చలో పాల్గొంటూ, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాకు ఎన్నడూ వ్యతిరేకం కాదని, కేంద్రంతో కలిసున్నందుకు తాము మాటలు పడుతున్నామని అన్నారు. అందరితో సంప్రదించకుండానే సంఖ్యాబలముంది కదా అని రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆరోపించారు. కనీస ప్రజాస్వామ్య నిబంధనలు పాటించకుండా విభజన జరిగిపోయిందని అన్నారు. విభజనకు కాంగ్రెస్, బీజేపీలే కారణమన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో బలంగా ఉందని, అది తొలగాలంటే, హోదా ఇవ్వడం ఒక్కటే మార్గమని అన్నారు. ఈ విషయమై ఎన్నో మార్లు ప్రధానితో తమ అధినేత చర్చించారని అన్నారు. విభజన రోజు తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యానని వివరించారు. ఏపీని విభజించేందుకు తొందరపడ్డ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉత్తరప్రదేశ్ ను విడగొట్టేందుకు వెనుకాడుతున్నాయని, అదంతా పొలిటికల్ గేమ్ అని సుజనా చౌదరి ఆరోపించారు.