: ఢిల్లీ కోర్టుకు నేడు రూ. 8,040 కోట్లు కట్టనున్న టాటా!


జపాన్ కు చెందిన ఎన్టీటీ డొకొమోతో ఉన్న కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం గత నెలలో ఇచ్చిన ఆదేశాల మేరకు, ఢిల్లీ హైకోర్టులో టాటా సన్స్ నేడు 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,040 కోట్లు) డిపాజిట్ చేయనుంది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ప్రకటించింది. భారత మొబైల్ రంగంలోని ప్రవేశించాలని భావించిన జపాన్ ఎన్టీటీ, డొకొమో టాటా టెలీసర్వీసెస్ లో 26.5 శాతం వాటాలను 2009లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఎంతగా ప్రయత్నించినా, ఇండియాలోని టాప్-3 పొజిషన్లకు టాటా డొకొమో చేరుకోలేక పోగా, 2014లో టాటాతో భాగస్వామ్యం నుంచి వైదొలగాలని సంస్థ నిర్ణయించింది. తాము టాటాకు చెల్లించిన మొత్తానికే తమ వాటాను విక్రయిస్తామని, అందుకు ఓ కొనుగోలుదారుడిని చూడాలని ఎన్టీటీ స్వయంగా కోరగా, అందులో టాటా సన్స్ విఫలమైంది. విదేశీ సంస్థలు భారత కంపెనీల్లోని తమ వాటాలను విక్రయించాలని భావిస్తే, అందుకు కొన్ని ఆర్బీఐ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ముందుగానే నిర్ణయించిన ధరకు వాటాలను అమ్మేందుకు ఆర్బీఐ అంగీకరించదు. తమ విషయంలో ఈ నిబంధన మార్చాలని టాటా సన్స్ కోరగా, ఆర్బీఐ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో జపాన్ సంస్థ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించగా, 1.2 బిలియన్ డాలర్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కాగా, ఇండియాలో ఇదే తరహా కేసులు మరో 10 వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. సమస్యను పరిష్కరించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు కంపెనీలకు ఆగస్టు 30 వరకూ గడువిచ్చింది.

  • Loading...

More Telugu News