: వ్యవసాయాన్ని లాభసాటిగా మారిస్తే పేదరికాన్ని నిర్మూలించవచ్చు: సీఎం చంద్రబాబు
వ్యవసాయాన్ని లాభసాటిగా మారిస్తే పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అధికారులతో ఈరోజు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, రైతుల సేవే మాధవ సేవగా భావించాలని, నదుల అనుసంధానం, నీరు-చెట్టు, చెరువుల మరమ్మతులతో భూగర్భ జలమట్టం గత ఏడాది కన్నా 2.5 మీటర్లు పెరిగిందని అన్నారు. ఈ పెరుగుదల 230 టీఎంసీలకు సమానమని, దాదాపు 23 లక్షల ఎకరాల్లో సాగు చేయవచ్చని తెలిపారు. 15,942 రెయిన్ గన్స్ కు ఆర్డర్ ఇస్తున్నామని, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం కనుక, ఉత్పాదకత పెంచాలని అధికారులను ఆదేశించారు. పంట రుణాల లక్ష్యం వంద శాతానికి చేరుకోవాలని చెప్పిన సీఎం, ప్రధాని ఫసల్ బీమాను వినియోగింగుకోవాలని అన్నారు. వచ్చేనెల 6వ తేదీన అనంతపురంలో రైతు ఉత్పత్తి సమాఖ్యను ప్రారంభిస్తామని, ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.