: కాకతాళీయమా? సంబంధమా?... చంద్రునిపై కాలుమోపిన వారంతా గుండెపోటుతోనే మృతి!


వ్యోమగామి జేమ్స్ ఇర్విన్ తన 43 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. నాసా చేపట్టిన చంద్రయాత్రకు వెళ్లి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత ఈ ఘటన జరిగింది. చంద్రుడిపై నడిచిన దానికి, ఇర్విన్ మరణానికీ సంబంధం లేదని అప్పట్లో వైద్యులు తేల్చారు. అయనకు అప్పుడప్పుడూ గుండె కొట్టుకునే వేగంలో మార్పు వచ్చే లక్షణాలున్నాయని, ఆ కారణంగానే గుండెపోటు వచ్చినట్టు తేల్చారు. అంతకు ఓ సంవత్సరం ముందు అదే మిషన్ లో ఆస్ట్రోనాట్ గా ప్రయాణం చేసిన రాన్ ఈవన్స్ తన 56 ఏళ్ల వయసులో గుండెపోటుతోనే మరణించారు. ఇక తొలిసారిగా చంద్రడిపై నడిచి చరిత్రలో నిలిచిపోయిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కూడా గుండె సమస్యతోనే తన 82వ ఏట 2012లో మృతి చెందారు. మొత్తం మీద నాసా ట్రైనింగ్ ఇచ్చి అంతరిక్షంలోకి పంపించిన ఆస్ట్రోనాట్లలో ఇప్పటివరకూ 77 మంది గుండె, రక్తనాళాల సంబంధ సమస్యలతోనే మృతి చెందారు. దీంతో అంతరిక్షంలోకి వెళ్లి వస్తే గుండె సమస్యలు తప్పవా? అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు పరిశోధకులు నడుం బిగించి తమ వంతు ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నా అవేమీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇర్విన్, ఇవాన్స్, ఆర్మ్ స్ట్రాంగ్ మరణాలకు ఒకే కారణం కనిపిస్తోందని, వీరందరిలో కామన్ గా కనిపిస్తున్నది ఒక్క చంద్రుడు మాత్రమేనని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ గుండె జబ్బుల నిపుణుడు మైఖేల్ డెల్ప్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ కేవలం 24 మంది మాత్రమే భూమి కక్ష్యను దాటి అంతరిక్షంలోకి ప్రయాణాలు సాగించారని మిగతా వారంతా భూ కక్ష్యను దాటకుండా స్పేస్ సెంటర్ కే పరిమితం అయ్యారని అధికారులు చెబుతున్నారు. అంతరిక్షలోతుల్లోకి వెళ్లిన వారికి రక్తనాళాలు, గుండెపై ఒత్తిడి పడే అవకాశాలు ఉన్నాయన్న భావన నెలకొందని వ్యాఖ్యానించిన డెల్ప్, అక్కడికి వెళ్లి పరిశోధనలు సాగిస్తేనే ఫలితాలు వెలువడతాయని చెప్పడం గమనార్హం. ఏదిఏమైనా చంద్రుడిని తాకి వచ్చిన వారంతా ఒకే రకమైన మరణాలకు గురికావడం ఇప్పటికి సస్పెన్సే మరి!

  • Loading...

More Telugu News