: జంపింగ్ నేత నుంచి నారా లోకేశ్ కు ఫోన్!... టీఆర్ఎస్ లో పరిస్థితి బాగోలేదని ఏకరువు!


తెలుగు రాష్ట్రాల్లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో టీ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి, ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. ఏపీలో పరిస్థితిని పక్కనబెడితే... తెలంగాణలో వలస వెళ్లిన నేతలు కొత్త పార్టీలో ఎలా ఉన్నారన్న విషయంపై నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇటీవల మరణించిన టీడీపీ నేతల కుటుంబాలకు లోకేశ్ పార్టీ సంక్షేమ నిధి నుంచి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన లోకేశ్... కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరుగుతూనే టీఆర్ఎస్ లోకి వెళ్లిన టీడీపీ నేతల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని వెల్లడించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ కొట్టిన ఓ కీలక నేత ఇటీవల నారా లోకేశ్ కు అదే పనిగా ఫోన్ చేస్తున్నారట. దీంతో అసలు విషయమేమిటో కనుక్కుందామని లోకేశ్ ఫోనెత్తగానే సదరు నేత తన గోడును వెళ్లబోసుకున్నాడట. దీనిపై లోకేశ్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... ‘‘టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఒకాయన ఇటీవల నాకు పదే పదే ఫోన్ చేశాడు. ఓ సారి మాట్లాడితే పోలా అని ఫోనెత్తి 'అన్నా బాగున్నావా?' అని అడిగిన. ‘ఏం బాగున్నామన్నా, ఇక్కడేం బాగాలేదు. పార్టీలో చేరే ముందు సీఎం కేసీఆర్ నాతో మూడు గంటల పాటు మాట్లాడిండు. చేరినప్పుడు బ్రేక్ ఫాస్ట్ కూడా ఇచ్చిండు. ఇగో, ఇప్పటివరకు మళ్లీ కలవనియ్యలే’ అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. మరి ఇంచార్జీ మంత్రితో అయినా మాట్లాడకపోయినవా? అని ప్రశ్నించగా...‘అన్నా నీకు నోరున్నది నాకు చెప్పుకున్నవు. నేను మంత్రిని. నాకు నోరు లేదని సదరు మంత్రి జవాబిచ్చారు’ అంటూ తన బాధ చెప్పుకున్నాడు’’ అని లోకేశ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News