: తెలంగాణ సీఎం కేసీఆర్ పై నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమ నిధి కింద చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో కొనసాగుతున్న పాలనపై నిప్పులు చెరిగారు. ప్రధానంగా కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకుంటే ఫలితాలిలాగే ఉంటాయని నారా లోకేశ్ సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కష్టపడి పాలన సాగించాలని చెప్పిన నారా లోకేశ్... కేసీఆర్ ఫాంహౌస్ పాలన కారణంగా మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ లోటు బడ్జెట్ లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. గడచిన 45 రోజుల పాలన చూస్తుంటే... కేసీఆర్ ను సొంత పార్టీ నేతలే నిలదీసే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోందని లోకేశ్ ఆరోపించారు. తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.