: ఏపీకి ఏం దక్కుతుందో తేలేది నేడే!... రాజ్యసభలో కీలక ప్రకటన చేయనున్న జైట్లీ!
రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కుతుందా?... లేక ప్రత్యేక ప్యాకేజీ దక్కుతుందా?... లేదంటే ఈ రెండు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇంకేదైనా ప్రకటిస్తుందా?... అలా కాకుండా అసలేమీ ఇచ్చేది లేదని పాత మాటనే వల్లె వేయనుందా?... అన్న విషయం నేటితో తేలిపోనుంది. ఈ మేరకు నిన్న ఆయా పార్టీల సభ్యులు రాజ్యసభలో చేసిన డిమాండ్లపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇవ్వనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై నిన్న సుదీర్ఘ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలోని అధికార, విపక్షాలకు చెందిన సభ్యులతో పాటు జాతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా కేవీపీ బిల్లుపై ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని అన్ని పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో సభలో బీజేపీ ఒంటరి అయిపోయింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా దీనిపై ప్రసంగించినా... బీజేపీకి ఏమాత్రం లాభం చేకూరకపోగా, విపక్ష నేతలు ఎదురు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల సభ్యులు చేసిన డిమాండ్లపై ప్రభుత్వం తరఫున నేడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... రాజ్యసభ నాయకుడి హోదాలో సమాధానం చెప్పనున్నారు. ఈ ప్రసంగంలోనే కేంద్రం నుంచి ఏపీకి ఏఏ ప్రయోజనాలు చేకూరనున్నాయన్న విషయాన్ని జైట్లీ స్పష్టంగా పేర్కొనక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జైట్లీ ప్రసంగంపై ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా ఆసక్తి నెలకొంది.