: ఏపీకి ప్రత్యేకహోదా అన్నది సంజీవనే... హోదా ఇవ్వాల్సిందే!: విజయసాయిరెడ్డి
బీజేపీ, టీడీపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని అన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎలా? అని ప్రశ్నించారు. చట్టసభల్లో ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ప్రజలకు చట్టసభలపై గౌరవం పోతుందని ఆయన చెప్పారు. అలా జరగడం ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన తెలిపారు. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సంజీవనేనని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం ద్వారా ప్రజలకు నిలదొక్కుకునే వెసులుబాటు కలుగుతుందని ఆయన తెలిపారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమైనప్పుడు, ప్రజాకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని, అందుకే ఏపీకి తక్షణం ప్రత్యేకహోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.