: అప్పుడు మద్దతిచ్చారు... ఇప్పుడు సాకులు చెబుతున్నారు!: సుబ్బరామిరెడ్డి


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్ధీకరణ బిల్లుపై నాటి చర్చ సందర్భంగా ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఏపీకి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తున్నామని సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి గుర్తు చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఏపీ విభజన బీజేపీ మద్దతు లేకుండా సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు. బిల్లు ఆమోదానికి నాడు మద్దతిచ్చి, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయానికి వచ్చేసరికి, ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయని సాకులు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీది ప్రత్యేకపరిస్థితి అని అందరికీ తెలుసని ఆయన చెప్పారు. మనం అంతా ఒకటని ఆయన తెలిపారు. అలాంటప్పుడు మన దేశంలో 5 కోట్ల మందికి ఉపయోగపడే పని చేయడానికి ఇబ్బందేమిటని ఆయన అడిగారు. ఇతర రాష్ట్రాలు అడుగుతున్నప్పుడు వాటికివ్వాలా? వద్దా? అన్నది అధ్యయనం చేయండని, దాని ప్రకారం అప్పుడు నిర్ణయం తీసుకోండని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఏపీకి మాత్రం ఇప్పుడే ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News