: ఏపీకి పదేళ్ల హోదా కావాలని వెంకయ్యనాయుడు అడిగారు: టీజీ వెంకటేష్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఐదేళ్లు ఇస్తామని నాటి ప్రధాని ప్రకటించారని, అయితే, ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని అప్పుడు ఈ సభలోనే డిమాండ్ చేశారని తెలుగుదేశం సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఏపీ డెవలెప్ అయ్యేందుకు అవసరమైన సహాయం చేస్తామని చట్టంలోనే ఉందని ఆయన చెప్పారు. ఆర్థిక లోటు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా ఇస్తే... రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. కేంద్రం అందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు అందుకు సహకరించడం లేదని ఆయన తెలిపారు. ఏపీలో 2019 వరకు ఆర్థిక లోటు ఉంటుందని ఆర్థిక సంఘం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని ఆయన డిమాండ్ చేశారు.