: ప్రధాని హామీలు ఇచ్చారు...సభలో ఇచ్చారు వాటిని నెరవేర్చాలి: సుఖేందు రాయ్
లోక్ సభ, రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగిందని టీఎంసీ ఎంపీ సుఖేందు రాయ్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. పది రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడ్డాయని కేంద్రం చెబుతోందని, అలాంటి పది రాష్ట్రాలకు కేంద్రం ఏం చేసిందని అన్నారు. రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రాల ఆర్థిక స్థితి మరింత దిగజారుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలు న్యాయంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ మొత్తాలను కేంద్రం ఇవ్వకపోవడం నేరమవుతుందని ఆయన చెప్పారు. కేంద్రం నేరం చేయకూడదని, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన బకాయిలు తీర్చాలని ఆయన సూచించారు. లేకపోతే ఏపీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆర్థికంగా దిగజారిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లేని పక్షంలో ఆ రాష్ట్రాలు దుర్భిక్షాన్ని ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు. టీఎంసీ ఏపీకి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.