: తెలంగాణలో మాత్రమే... మా 'ఎంసెట్'లో అక్రమాలు జరగలేదు: ఏపీ మంత్రి కామినేని
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో ఎటువంటి అక్రమాలూ జరగలేదని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులు 15 శాతం ఓపెన్ కోటా కోసం రాష్ట్ర విద్యార్థులతో పోటీ పడితే, ఇక్కడి వారికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఆప్షన్ల నమోదును వాయిదా వేశాం తప్ప, పరీక్షలపై ఎలాంటి అనుమానాలూ లేవని ఆయన అన్నారు. ఆగస్టు తొలి వారాంతంలో అప్షన్లు నమోదు చేస్తామని తెలిపారు. తెలంగాణలో మాత్రమే ఎంసెట్ పేపర్ లీకైందని చెప్పిన ఆయన, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే, ఏపీ విద్యార్థులు నష్టపోతారని అన్నారు. ఆంధ్రాలో పీజీ సీట్లు తీసుకున్న వారు వెంటనే చేరాలని, సీట్లు తీసుకునే సమయంలోనే ఒరిజినల్స్ అప్పగించాలని తెలిపిన ఆయన, సీటును రద్దు చేసుకుంటే రూ. 2 లక్షలు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ లో సీట్లు తీసుకుని, ఆపై కోర్సుల్లో చేరని విద్యార్థుల వైఖరితో మిగతావారికి అన్యాయం జరుగుతోందని కామినేని చెప్పారు.