: స్విట్జర్లాండ్ నుంచి సింగపూర్, ఖతార్, దుబాయ్ లకు తరలుతున్న నల్లధనం?
నల్లధనాన్ని తరలించేందుకు స్విట్జర్లాండ్ స్వర్గధామమని గతంలో పేర్కొనేవారు. అయితే చట్టాలు సవరించడం, వివిధ దేశాలతో సమాచార మార్పిడి ఒప్పందాలు చేసుకోవడంతో స్విట్జర్లాండ్ ఈ హోదాను కోల్పోతోంది. స్విస్ లో పన్ను చెల్లింపు అంశాన్ని పారదర్శకంగా చేయడంతో భారతీయ బిలియనీర్లు ఇతర దేశాలవైపు చూస్తున్నారని ప్రముఖ వ్యాపారవేత్త, జెనీవాలోని హిందుజా బ్యాంక్ లో వాటాదారైన గోపీచంద్ హిందుజా పేర్కొన్నారు. డబ్బు దాచుకోవాలని భావిస్తున్న ప్రపంచ కుబేరులంతా ప్రస్తుతం దుబాయ్, ఖతార్, సింగపూర్ వంటి దేశాలవైపు చూస్తున్నారని ఆయన వెల్లడించారు. దీంతో స్విట్జర్లాండ్ బ్యాంకుల నుంచి డబ్బు తరలిపోతోందని ఆయన వెల్లడించారు. స్విస్ కూడా గతంలోలా డిపాజిట్లు తరలిపోకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన తెలిపారు. స్విట్జర్లాండ్ చేసుకున్న ఒప్పందాల కారణంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల నుంచి వస్తున్న దర్యాప్తులు, కొత్త విధానంలో కుదిరిన బ్యాంకు సమాచారం మార్పిడి ఒప్పందాలు అక్కడి పరిస్థితిని ఒక్కసారిగా మార్చేశాయని ఆయన చెప్పారు. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా అకౌంట్ ఇచ్చి సంపదను భద్రపరిచే స్విస్ బ్యాంకులు, ఇప్పుడు వివిధ ప్రశ్నలు అడుగుతున్నాయని, దానికి తోడు స్విస్ కరెన్సీ ఫ్రాంక్ మారకం విలువ బలంగా ఉండడం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. దీంతో కుబేరులంతా దుబాయ్, ఖతార్, సింగపూర్ వంటి దేశాల బ్యాంకుల్లో డబ్బు దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.