: సల్మాన్‌ను కేసు వదిలేలా లేదు.. కృష్ణజింకలను వేటాడిన కేసులో సుప్రీంకు వెళతామన్న రాజస్థాన్ మంత్రి
కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌కి రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించి, నిర్దోషిగా తీర్పు వచ్చినప్పటికీ ఆయనకు కష్టాలు తప్పడం లేదు. జింకలను వేటాడిన కేసులో సరైన సాక్షాలు లేవని ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జింకలను సల్మానే చంపాడంటూ ఇన్నాళ్లూ అజ్ఞాతంలో వున్న జీపు డ్రైవర్ హరీశ్‌దులానీ ఇప్పుడు తెరపైకి రావడంతో సల్మాన్‌కి షాక్ తగిలింది. డ్రైవర్ చెబుతోన్న సాక్ష్యాలతో కేసు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 'నన్ను చంపేస్తామంటూ మా నాన్నను పలువురు బెదిరించారు. అందుకే, నేను భయపడి జైపూర్ వదిలి పారిపోయాను' అని హరీశ్ అన్నాడు. వారి నుంచి ఏ హానీ కలగకుండా తనకు రక్షణ కల్పించివుంటే తాను ఆ కేసులో సాక్షిగా ఉండేవాడినని ఆయన అన్నాడు. సల్మాన్‌ఖానే జింకను వేటాడారని చెప్పేవాడినని పేర్కొన్నాడు. దీంతో రాజస్థాన్ న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ స్పందిస్తూ.. సల్మాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో ఇటీవల న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. దీని కోసం తాము ప్రస్తుతం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా ఈ అంశంపై స్పందిస్తూ.. హరీశ్ తనకు రక్షణ కావాలంటూ లిఖితపూర్వకంగా తమను కోరలేదని, ఒక వేళ ఆయన తమను కోరితే అందుకు సిద్ధమేనని ఆయన చెప్పారు.