: మోదీ, తొగాడియాలను హత్య చేసేందుకు అబూ జిందాల్ కుట్ర వాస్తవం: మహారాష్ట్ర కోర్టు
2002 గుజరాత్ అల్లర్ల తరువాత, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాలను హత్య చేసేందుకు అబూ జిందాల్ అలియాస్ సయ్యద్ జుబేదిన్ అన్సారీ కుట్ర పన్నాడన్న ఆరోపణలు వాస్తవమేనని ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్ పై ముంబై మోకా (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కోర్టు అభిప్రాయపడింది. వీరు మాలేగావ్ కేంద్రంగా కుట్ర పన్నారనడానికి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని న్యాయమూర్తి శ్రీకాంత్ అనేకర్ వ్యాఖ్యానించారు. ఆరోపణలు వచ్చిన అందరినీ నిందితులుగా భావించలేమని, అబూ జిందాల్ తో పాటు మరొకరికి మాత్రమే కుట్ర వెనుక ప్రమేయం ఉందని ఆయన అన్నారు. కాగా, మే 8, 2006న మహారాష్ట్రలో 30 కేజీల ఆర్డీఎక్స్, 10 ఏకే 47 తుపాకులు, 3,200 బులెట్లను తీసుకెళ్తూ ఏటీఎస్ పోలీసులకు పట్టుబడ్డ జిందాల్, తమ వాహనాలను వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆపై మాలేగావ్ కు, అటునుంచి బంగ్లాదేశ్ కు, ఆపై పాక్ కు పారిపోయాడు కూడా. 2012లో సౌదీ అరేబియాలో పట్టుబడి, నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా అబూ జిందాల్, ఆయన సహచరి మోనికా బేడీలను ఇండియాకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.