: భర్తను ఊరెళ్లనియ్యకుండా చేసేందుకు భార్యామణి 'బాంబు' బెదిరింపు!


తన భర్త ఊరెళ్లడం ఇష్టం లేని భార్య ఎంత పని చేసిందంటే... ఎయిర్ పోర్టు లో బాంబు పెట్టారంటూ ఏకంగా అక్కడి సిబ్బందికే ఫోన్ చేసి చెప్పింది. నిన్న సాయంత్రం జెనీవాలోని కాయిన్ ట్రిన్ ఎయిర్ పోర్ట్ లోని స్విస్ కస్టమ్స్ అధికారులకు అక్కడ బాంబు ఉందంటూ ఒక మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్ పోర్ట్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకోవడంతో పాటు, అక్కడికి వచ్చే ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని గంటల తర్వాత ఎక్కడా బాంబు లేదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత విమానాశ్రయంలో సేవలను పునరుద్ధరించారు. అయితే, ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై అధికారులు ఆరా తీయగా, జెనీవాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్ లోని అన్నెసీ ప్రాంతంలోని ఒక మహిళ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఫ్రెంచ్ పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా, తన భర్తను ఊరెళ్లనీయకుండా చేయాలనే, తాను బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేశానని చెప్పింది. కాగా, మహిళపై రెండు దేశాల్లో కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News