: 12 లక్షల ఉద్యోగాలివ్వనున్న ఈ-కామర్స్: ఆశలు పెంచిన హెచ్ఎస్ బీసీ రిపోర్ట్
భారతదేశంలో నిరుద్యోగులకు శుభవార్తను చెబుతూ హెచ్ఎస్బీసీ ఓ తాజా నివేదికను విడుదల చేసింది. వచ్చే పదేళ్లలో భారత ఈ-కామర్స్ రంగంలో 12 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొంది. 2026 నాటికి 8 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి అవసరమని, టెక్ ఆధారిత ఉద్యోగాలే అధికంగా రానున్నాయని అంచనా వేసింది. ప్రస్తుతం భారత ఈ-కామర్స్ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని గుర్తు చేసిన హెచ్ఎస్బీసీ, యువత అధికంగా ఉండటం, డిజిటల్ చెల్లింపుల విభాగం విస్తరణ, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం వంటి అంశాలు ఈ-కామర్స్ రంగంలో వినూత్నమైన మార్పునకు కారణం కానున్నాయని వెల్లడించింది. లాజిస్టిక్స్, డెలివరీ, కస్టమర్ ప్రొటెక్షన్, ఐటీ మెయిన్ టెనెన్స్ విభాగాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే స్థూలంగా 2 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని తన రిపోర్టులో పేర్కొంది. వచ్చే పదేళ్లలో 2.4 కోట్ల ఉద్యోగాల లోటు ఉంటుందని అంచనా వేసిన సంస్థ, ప్రస్తుతం సగానికి పైగా శ్రామిక శక్తి వ్యవసాయ రంగంలోనే ఉందని, భవిష్యత్తులో వ్యవసాయాన్ని వీడి ఇతర రంగాల్లో ఉపాధిని వెతుక్కునే వారి సంఖ్య పెరగనుందని అంచనా వేసింది.