: 45 వార్తా పత్రికలను, 16 న్యూస్ ఛానళ్లను మూసివేసిన టర్కీ ప్రభుత్వం
టర్కీలో ఇటీవల సైనిక తిరుగుబాటు చెలరేగి ఆ దేశంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, మళ్లీ అటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆ దేశ ప్రభుత్వం కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఎర్డగాన్ ప్రభుత్వం సైనిక కుట్రలో భాగస్వామ్యమయిన ఏ సంస్థలనూ వదిలిపెట్టడం లేదు. మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. దేశంలోని 45 వార్తాపత్రికలను, 16 న్యూస్ ఛానళ్లను మూసివేసింది. మరికొన్ని చిన్న మీడియా సంస్థలతో కలిపి మొత్తం 130 సంస్థలపై ఆ దేశం ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. టర్కీలో ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా సుమారు 1700 మంది సైనికులతో పాటు 87 మంది జనరల్స్‌ను కూడా బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉంటూ ఉగ్రవాద సంస్థను నడిపిస్తోన్న ఫెతుల్లా గులెన్ అనే వ్యక్తే టర్కీలో సైనిక తిరుగుబాటుకు కారణమని టర్కీ భావిస్తోంది. గులెన్‌ను టర్కీకి అప్పగించాలని ఆ దేశ ప్రభుత్వం అమెరికాను విజ్ఞప్తి చేసింది.