: అన్నా చెల్లెళ్లమని చెప్పుకుంటూ నీచానికి తెగించిన దంపతులు!
బాహ్య ప్రపంచానికి అన్నా చెల్లెళ్లమని చెప్పుకుంటున్న ఓ జంట నీచానికి ఒడిగట్టింది. 20 మంది యువతులపై అత్యాచారం, ఆపై 100 సవర్ల నగల దోపిడీ కేసులో అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, తిరుప్పూర్ జిల్లాకు చెందిన గురు దీనదయాళన్, ప్రియదర్శినిలు భార్యాభర్తలు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న దురాశతో, ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా యువతులకు దీనదయాళన్ వల విసురుతుంటే, ప్రియదర్శిని భర్తకు సహకరించేది. తమ వలలో పడిన అమ్మాయిలకు వీరు అన్నా చెల్లెళ్లమని పరిచయం చేసుకునేవారు. తిరువేంబుయూర్ కు చెందిన ఓ కాలేజ్ విద్యార్థిని అదృశ్యం కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన వేళ, ఆ యువతి పోలీస్ స్టేషన్ కు వచ్చి, తనను ఓ యువకుడు, అతని చెల్లి మోసం చేశారని ఫిర్యాదు చేసింది. ప్రేమిస్తున్నానని చెప్పి పలుమార్లు అత్యాచారం చేసిన దీనదయాళన్, తన వద్ద 8 సవర్ల నగలు అపహరించిన తరువాత చెల్లెలితో కలసి పారిపోయాడని చెప్పింది. ఆమె ఇచ్చిన కొన్ని ఫోటోల ఆధారంగా, తిరుచ్చి బస్టాండ్ లో అన్నాచెల్లెళ్లుగా చెప్పుకుంటున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో పరిచయమైన వారిని ప్రేమలోకి దింపేవాడని, పెళ్లి చేసుకుందామని, నగలతో రావాలని చెప్పేవాడని, మాయమాటలను ఎవరైనా నమ్మి వస్తే, వారిని నిలువునా మోసగించేవాడని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ 20 మంది మహిళలు ఈ జంట బారిన పడ్డట్టు తేలిందని వివరించారు.