: శరవేగంగా పెరుగుతున్న శ్రీశైలం జలాశయ నీటిమట్టం
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయం వేగంగా నిండుతోంది. ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం గతవారమే నిండిపోగా, వస్తున్న నీటిని వస్తున్నట్టు కిందకు వదులుతున్నారు. తుంగభద్రకు ఇన్ ఫ్లో 7,857 క్యూసెక్కులుగా ఉంది. ఇదే సమయంలో సుంకేసుల జలాశయానికి 15 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 13,236 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కేసీ కెనాల్ కు 1,520 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయానికి ఇన్ ఫ్లో 22,331 క్యూసెక్కులుండగా, 24 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా శ్రీశైలానికి పరుగులు పెడుతూ వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ లోకి నేటి ఉదయం 37,586 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం డ్యామ్ లో 807 అడుగులకు నీరు చేరింది. కాగా, శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులన్న సంగతి తెలిసిందే.