: జైలు నుంచి పారిపోయి వచ్చిన కొడుకును పట్టించిన హత్యకేసు నిందితురాలు!
తమ ఇంటికి నిప్పంటించారన్న ఆరోపణలపై క్షణికావేశంలో పొరుగింటి వ్యక్తిని ఆ కుటుంబమంతా కలిసి హత్య చేయగా, బెయిలుపై బయటున్న తల్లి, జైలు నుంచి పారిపోయి వచ్చిన కొడుకును స్వయంగా పోలీసులకు పట్టించింది. ఈ ఘటన అహ్మదాబాద్ లోని సర్దార్ నగర్ పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్ ధావల్ నాలుగు రోజుల క్రితం తప్పించుకున్నాడు. ఆపై రెండు రోజులకు తన తల్లికి ఫోన్ చేసి డబ్బులు కావాలని కోరాడు. తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాలని, చట్టానికి లోబడి ఉండాలని భావించిన తల్లి ఆశాబెన్, డబ్బులు ఇస్తానని చెప్పి, పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వారు వచ్చి ప్రవీణ్ ను మరోసారి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. కాగా, ఇదే కేసులో ఆశాబెన్ భర్త పురుషోత్తం, మరో కుమారుడు ప్రతాప్, కుమార్తె, అల్లుడు కూడా నిందితులే.