: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాక్.. శాసనసభ స్థానాలు పెంచే ప్రసక్తే లేదన్న ప్రభుత్వం


తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాకిచ్చింది. శాసనసభ స్థానాలు పెంచే ప్రసక్తే లేదని బుధవారం తేల్చిచెప్పింది. సీట్ల పెంపు ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కుండబద్దలు కొట్టింది. 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణకు అవకాశం ఉందని పేర్కొంటూ తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్రం ప్రకటనతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు డీలా పడినట్టు కనిపిస్తోంది. శాసనసభ స్థానాల సంఖ్య పెరిగితే లాభపడవచ్చని భావించి అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కేంద్రం ప్రకటనతో నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది. బుధవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ టి.దేవేందర్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పై విధంగా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర హోంశాఖ కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిందా? అదే జరిగితే ఆ వివరాలేంటి? అంటూ దేవేందర్‌గౌడ్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి హన్స్‌రాజ్ ఆర్టికల్ 170ని సవరించకుండా పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26లో ఒక రకంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో మరో రకంగా ఉన్నాయని, ఈ రెండూ సంఘర్షించుకుంటే ఏది చెల్లుబాటు అవుతుందనే విషయంపై న్యాయశాఖ సలహా కోరినట్టు మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26ను సవరించి సెక్షన్ 26(1)ను అమలు చేయలేమని భారత అటార్నీ జనరల్ అభిప్రాయపడినట్టు తెలిపారు. ఆర్టికల్ 170లోని ‘నిబంధనలకు లోబడి’ అన్న వ్యాక్యానికి బదులు ‘నిబంధనలకు సంబంధం లేకుండా’ అన్న వాక్యం చేర్చి సవరించినా కుదరదని అటార్నీ జనరల్ చెప్పినట్టు మంత్రి పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీట్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గినట్టు వివరించారు. ప్రస్తుతానికైతే ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News