: అమరావతికి బెజవాడే కేంద్ర బిందువు.. ప్రపంచంలోనే సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బెజవాడ కేంద్ర బిందువుగా ఉండబోతోందని, ప్రపంచంలోనే అత్యంత సుందర నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు స్పష్టం చేశారు. రూ.123.35 కోట్లతో నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డును బుధవారం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రింగ్ రోడ్డును అమరావతి రాజధాని సీడ్ క్యాపిటల్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. వచ్చే నెల 12న ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలపై మాట్లాడుతూ నగరంలోని ప్రతీ ఇల్లూ పుష్కర యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వాలని కోరారు. అనంతరం విజయవాడ పాతబస్తీలో రూ.10.50 కోట్లతో పునర్నిర్మించనున్న షాజహూర్ ముసాఫిర్ ఖానా ఐదంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమమే తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం బడ్జెట్లో మొట్టమొదటిసారిగా రూ.710 కోట్లు కేటాయించిన ఘనత తమదేనని పేర్కొన్నారు.