: ఎకరా 80 వేలు ధర ఉంది... 7 లక్షలు ఇస్తామంటున్నాం: హరీష్ రావు


మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో జీవో 123 ఇవ్వడం వల్ల రైతులకు ఒక్క రూపాయి కూడా అన్యాయం జరగదని మంత్రి హరీష్ రావు తెలిపారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. మల్లన్నసాగర్ పరిసర ప్రాంతాల్లో ఎకరా 80 వేల రూపాయల ధర ఉందని హరీష్ రావు తెలిపారు. అలాంటి చోట్ల మూడు రెట్ల ధర వారికి ఇస్తే సుమారు 2,40,000 రూపాయలు వస్తాయని, అలాంటిది తెలంగాణ ప్రభుత్వం 7 లక్షల రూపాయల నగదు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. వారికి డబుల్ బెడ్రూం ఫ్లాట్లు ఇస్తామంటున్నాం. ముంపు బాధితులకు ఈ ప్రాజెక్టులో పట్టే చేపల ఆదాయంలో లాభం పంచేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భూసేకరణ సందర్భంగా రైతులతో చేసుకునే ఒప్పందాలను ఆయా గ్రామాలలోని రచ్చబండలో డాక్యుమెంటేషన్ చేసి, చెక్కులు ఇస్తామని ఆయన చెప్పారు. ఇంతకంటే ఏ ప్రభుత్వం గొప్పగా చట్టాన్ని అమలు చేయదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేయడం తప్ప అక్కడ ఇంకేమీ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న ప్రతి విపక్ష నేత అక్కడ ప్రజలను రెచ్చగొట్టేందుకు వెళ్తున్నారని, అక్కడి ప్రజలు ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News